Monday, November 5, 2007

కల

లోకజ్ఞానం, ఆత్మజ్ఞానం వేరువేరుగా కొలవబడుతున్నప్పుడు కల కనలేని జీవితం శూన్యమనిపిస్తుంది. కల కనటం ఓ సాహసమనిపిస్తుంది. కలలేనిజీవితం రోడ్డుపై పడిన కాగితమైపోతుంది. వాహనాల తాకిడిలో ఎటుగాలివీస్తే అటు కొట్టుకుపోతుంది. బతుకు ప్రయాణంలో కలలు అలలు అలలుగా తేలిపోతుంటాయి. కలలంటే ఆశయాలు, ఆలోచనలతో కలిపి లోకంలోనో, అతఃలోకంలోనో భవిష్యకాలపు పొరల్లోకి తొంగిచూడటమే. ఏది కలో ఏది కదో కనుగొనటం కోసం పరికరాలను ఎవరికివారు కూర్చుకోవలసిందే. పుటంవేయబడిన కలలు గీటురాయికి నిలుస్తాయి.
కలకోసం, సాకారపు అడుగుల్లో అలసిన దేహంతో ఆద్మరచి నిదురిస్తున్నప్పుడు కలరాదు. కలతచెందిన అలోచనలమద్య కనుపాపలు చిక్కుకొని నిదురను దూరంచేస్తున్న దైన్యంలోనూ కలరాదు. దేహాన్ని సేదదీరుస్తున్న వాస్తవ, అవాస్తవాల నడుమ వూగుతున్నప్పుడు వెతుకులాటల వాస్తవాల దర్పణంలో ఎక్కణ్నుంచో ఏ జాములోనో రెప్పలపైవాలి చిత్రంగా నిలిచిపోతుంది, జీవితాన్ని మార్చివేస్తుంది.
కన్నకల సాకారం ఓ సాహసమనిపిస్తుంది. కనులు చూస్తున్నంతమేరా ముళ్ళదారులు, మిట్టపల్లాలు, ఎండమావులై వూరిస్తున్న ఎడారిదిబ్బలు, సడలించే పట్టుకోసం బాధించే ముళ్ళై పొడిచే మాటలు ఎదురుచూస్తుంటాయి. ఏ ఒక్కటీ సుళువుగా వదలదు. చేదించుకుంటూ సాగాల్సిందే.
కల కనటమంటే రాగద్వేషాల మద్య విభేదాన్ని భుజానికెత్తుకున్నట్టే. వెలివేయడనికో, అమ్మేయడానికో మనల్ని మనం అప్పగించుకున్నట్టే. అయినా నియమింపబడిన దారెపుడో పునాదులు తవ్వి విజయపథం పరచబడుతుంది. నడకేమీ సులభం కాదు. పిడచకట్టుకుంటున్న నాలికైనా కలను నెమెరెయాల్సిందే.
ఎన్నడూ దున్నని భూమిలో మొలకలు దర్శించడం లోకులకు వెర్రితనంగా కంపిస్తుంది. వెన్నొంగిన పంటను కోసేందుకు కదిలే కూలీలు పనలనుమోస్తూ
పాడే పాటలలో కన్నీటి కష్టమేదో దాగివుంటుంది. పనలనుదులిపి విత్తనాలుగానో రోట్టెగానో రూపాతరం చెందుతుంది.
"నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును... మీ ముసలివారు కలలు కందురు, మీ యౌవనస్థులు దర్శ్నములు చూతురు" యోవేలు 2:28(బైబిలు)