Wednesday, April 23, 2008
బ్లాగ్విషయం - గ్రంధాలయం - నా జ్ఞాపకాలు, అనుభవాలు
పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం గ్రామం, 1970 -72 సంవత్సరాలమద్య 6- 7 తరగతులు చదివేటప్పుడు గ్రంధాలయం పరిచయమయ్యింది. అప్పట్లో చందమామ, విజయచిత్ర, సినిమారంగం సోవియెట్‌భూమి పత్రికలు పరిచయమయ్యాయి. అప్పటిలోనే నవలలు ఎక్కువగా చదివే వారు. మా కాలనీలో కొంతమంది నాకంటే పెద్దవారు తరచూ నవలలు చదవటం, ఒకరి పుస్తకాలను ఒకరు ఇచ్చిపుచ్చుకోవటం జరిగేది. ఆ కార్యక్రమమంలో నేను వార్తాహరుడిగా దూరే వాణ్ణి. వారితో తోడుగా వెళ్ళి వాళ్ళు నవలలు వెతుక్కొనేలోపు విజయచిత్రను తిరగెయ్యటం, చందమామలో ఒక కథ చదవడం, వేరేవారు చుదువుతుంటే దానికోసం నిరీక్షించడం లీలగా గుర్తుకొస్తున్నాయి. ఇక్కడే నాటకాలతో పరిచయం ఏర్పడింది. కృష్ణమూర్తి గారని మా ఇంటి ప్రక్కన వుండే వారు. (ఆయన అప్పటిలో నాటకాలు వేసేవారు. తర్వాత చాలా సినిమాలలో జడ్జి పాత్రలు వేయడం వల్ల జడ్జి కృష్ణమూర్తిగా ఇప్పటికి నటిస్తున్నారు.)ఈ లైబ్రరీలోని ఒక రూములో రిహార్సల్సు జరిగేవి. అప్పటికే నా దస్తూరి బాగుండటంవలన స్క్రిప్టు రాయించుకోవడానికి అప్పుడప్పుడూ తీసుకువెళ్ళేవారు. ఆవూరిలో వున్న ఎన్.జి.వోలు అందరూ కలసి తరచూ నాటకాలు వేస్తుండేవారు. వారికి స్క్రిప్టుతో పాటు నీళ్ళు, సిగరెట్లు, ఫలహారాలు అందించిన గుర్తు. ఆ సమయంలోనే "కర్ణ" ఏక పాత్రాభినయం కంఠతా పట్టిన గుర్తు. ఇంటరు చదివే రోజుల్లో శెలవలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూ వెళ్ళిన గుర్తు. ఖచ్చితంగా ఏ పుస్తకాలు చదివానో గుర్తు రావటంలేదు.1986 గోదావరి వరదలలో లైబ్రెరీ బాగా దెబ్బతిందని విన్నాను, అంతే కాదు భవనం కూడా మారింది. చాలా సార్లు పోలవరం వెళ్లినా గ్రంధాలయానికి వెళ్ళిన గుర్తు లేదు.
Subscribe to:
Posts (Atom)